సుశీల్‌కు ప్రశాంత్‌ కిషోర్‌ కౌంటర్‌ అటాక్‌

పట్నా : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై జనతాదళ్ (యునైటెడ్)లో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్, పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. సుశీల్‌ను ఉద్దేశిస్తూ.. కొంతమంది బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్ల కృతజ్ఞత చూపలేదని ఆరోపిస్తూ ప్రశాంత్ కిషోర్ శనివారం సుశీల్ కుమార్ పాత వీడియోను తన ట్విటర్‌లో షేర్‌ చేశారు.



'నితీష్ కుమార్ పార్టీలో కొంతమందికి ఎటువంటి గుర్తింపు లేకున్నా తనకున్న అధికారంతో వారికి గౌరవమైన స్థానాన్ని కల్పించారు. ఏ రాజకీయ ఎజెండా, సిద్ధాంతాలు లేకుండా కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు. అధికార పార్టీని దెబ్బతీసేందుకు విపక్షాలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల డేటాను సేకరించి విపక్ష పార్టీలకు చేరవేస్తూ రాజకీయంగా లబ్ధి చేస్తున్నారంటూ' సుశీల్‌ కుమార్‌ ఇంతకుముందు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై ప్రశాంత్‌ కిషోర్‌ కౌంటర్‌ అటాక్‌ ఇస్తూ.. ప్రజలకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వడంలో సుశీల్ మోదీని మించినవారు ఎవరు ఉండరని  ఎద్దేవా చేశారు.