వాటిపై దృష్టి సారించాం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆధునిక భారత నిర్మాణానికి కావాల్సిన నైపుణ్యాలపై దృష్టి పెట్టామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ బడ్జెట్‌ పెట్టుబడులు, ఆదాయం, డిమాండ్‌ను పెంచి ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. దేశ ప్రజల అవసరాలను, దశాబ్దపు ఆర్థిక అంచనాలను పరిపూర్ణం చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు.  దూరదృష్టితో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ ద్వారా అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందని.. ఈ దశాబ్దపు తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆమె బృందానికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గురించి మోదీ మాట్లాడుతూ... దేశం నుంచి ఎగుమతులు పెంచేందుకు బడ్జెట్‌లో ప్రోత్సహకాలు కల్పించామన్నారు. యువతకు ఉపాధి, పరిశ్రమల్లో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు.